Ante Sundaraniki On OTT | నాని, నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 12న విడుదలై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం ఎలాంటి జోరు చూపించలేకపోతుంది. నాని గత సినిమాలను పోల్చితే ఈ చిత్రం లోయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఈ చిత్రం దాదాపు రూ.20 కోట్ల కలెక్షన్లను మాత్రమే సాధించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.12 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర ఓటీటీ విడుదలకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ‘అంటే సుందరానికీ’ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం జూలై మొదటి వారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నానికి జోడీగా నజ్రియా హీరోయిన్గా నటించింది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థ నిర్మించింది. నాని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. నాని గత నాలుగైదు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేకపోయాయి. ఈ విషయంలో నాని కాస్త ఆలోచించాలని నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు. నాని కథల ఎంపిక, డైరెక్టర్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కామెంట్స్ చేస్తున్నారు.