తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులది సూపర్‌హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. ముఖ్యంగా ‘అఖండ’ చిత్రం వందకోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ‘అఖండ-2’ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. నందమూరి తేజస్విని సమర్పణలో 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి బ్రహ్మణి క్లాప్‌నివ్వగా, తేజస్విని కెమెరా స్విఛాన్ చేశారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న పవర్ఫుల్ స్క్రిప్ట్ ఇదని, తొలి భాగానికి మించిన ఎమోషన్స్, యాక్షన్ ఘట్టాలుంటాయని, బాలకృష్ణ పాత్ర మరింత శక్తివంతంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంతోష్ డి డెటాకే, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.