అగ్ర నటుడు బాలకృష్ణ వరుసగా సినిమాల్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. దసరా రిలీజ్ లక్ష్యంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. ఇదిలా వుండగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్లో కూడా ఓ సినిమా ఖరారైందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇది పోలీస్ కథాంశామని సమాచారం.
ఓవైపు షూటింగ్లో బిజీగా ఉంటూనే, మరోవైపు కొత్త కథల్ని ఓకే చేస్తున్నారు బాలకృష్ణ. ఈ నేపథ్యంలో వివేక్ ఆత్రేయ సినిమా టైటిల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది. ఈ చిత్రానికి ‘కురుక్షేత్రం’ అనే పవర్ఫుల్ టైటిల్‌ని పరిశీలిస్తున్నారని, దాదాపుగా ఇదే ఫైనల్ అవుతుందని చెబుతున్నారు. కథా పరిధి దృష్ట్యా రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. అయితే 111వ చిత్రం తర్వాత వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల చిత్రాల్లో ఏది ముందు పట్టాలెక్కుతుందోనని బాలకృష్ణ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.