Namitha | ఒకప్పుడు తన అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి నమిత ప్రస్తుతం సినిమాలకు దూరంగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే గతంలో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బిగ్బాస్ అనుభవాలు, సోషల్ మీడియాలో ఎదురైన వ్యక్తిగత విమర్శల గురించి నమిత చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. తమిళ్ బిగ్బాస్ షోలో పాల్గొన్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ , ఆ షోలో పాల్గొనే వారికి ప్రధానంగా రెండు మార్గాలు ఉంటాయని చెప్పారు. ఒకటి నిజాయితీగా, సహజంగా ఉండటం. అయితే ఆ మార్గాన్ని ఎంచుకుంటే విమర్శలు, అవమానాలు, వ్యక్తిగత దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
మరోవైపు ప్రేక్షకులు ఏమి చూడాలనుకుంటున్నారో అదే చూపిస్తూ, భావోద్వేగాలు లేదా ఇతర అంశాలతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయవచ్చని చెప్పారు. కానీ అది కొంతవరకు నటనతో కూడుకున్నదని అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, తనకు దగ్గరైన వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటే తాను మౌనంగా ఉండనని తెలిపారు. “నేను నా కోసం మాత్రమే కాదు, నా కుటుంబం, స్నేహితుల కోసం కూడా నిలబడతాను” అని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో ఎదురైన ట్రోలింగ్ గురించి మాట్లాడిన నమిత, కొన్ని కామెంట్లు తనను తీవ్రంగా బాధించాయని వెల్లడించారు. మొదట్లో అలాంటి వ్యాఖ్యలను చూసి మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానని చెప్పారు. తన భర్త కూడా ఇన్స్టాగ్రామ్ కామెంట్లను బ్లాక్ చేయమని సూచించారని తెలిపారు.
అయితే తరువాత తాను పరిస్థితిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని భావించానని తెలిపారు. కొందరికి తన వైపు వివరించే ప్రయత్నం చేశానని, కొందరు అర్థం చేసుకున్నారని, మరికొందరు అర్థం చేసుకోలేదని చెప్పారు. అలాగే సోషల్ మీడియాలో కొందరు చేసే వ్యక్తిగత వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉంటాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, పిల్లలు లేదా వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని చేసే వ్యాఖ్యలు మరింత బాధ కలిగిస్తాయని చెప్పారు. బిగ్బాస్ లాంటి షోలలో ప్రసారమయ్యే కొన్ని గంటల ఎపిసోడ్ల ఆధారంగా ఒక వ్యక్తిని పూర్తిగా అంచనా వేయడం సరికాదని నమిత అభిప్రాయపడ్డారు. ఒకరి గురించి కామెంట్ చేసే ముందు వారి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని సూచించారు. నమిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.