Nagarjuna| తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.అక్కినేని నాగేశ్వరరావు టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించారు. ఆయన నట వారసులుగా చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నాగేశ్వరరావు నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ్… ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో తన తండ్రి లెగసిని కొనసాగించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నాగార్జున దారిలోనే అక్కినేని వారసులు సుమంత్, సుశాంత్, నాగచైతన్య, అఖిల్ నటులుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తమ టాలెంట్ చూపించుకుంటున్నారు. వీరంతా నటులుగా, నిర్మాతలుగా అక్కినేని మూడోతరం వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
అయితే అక్కినేని మూడు తరాల నటులు కలిసి నటించిన సినిమా మనం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది నాగేశ్వరరావు చివరి సినిమా కాగా, ఇందులో అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి సందడి చేశారు. ఈ మూవీ వారికి క్లాసిక్ మూవీగా నిలిచింది . డైరెక్టర్ విక్రమ్ కే. కుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా 2014 మే 23న విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఇలాంటి మూవీ కోసం నాగార్జున ఎంతో తపన పడుతున్నాడు. కింగ్ నాగార్జున 100వ చిత్రం చేరువలో ఉండగా, ఇప్పుడు ఆయన సెంచరీ మూవీపై చాలా మంది దర్శకులు కన్నేసారు. పూరి జగన్నాధ్, మోహన్ రాజా, తమిళ్ డైరెక్టర్ నవీన్ సహా పలువురు కథలు సిద్ధం చేసి నాగార్జునకు స్టోరీలు చెప్పాలని అనుకుంటున్నారట.
అయితే అక్కినేని కాంపౌండ్ నుంచి తాజాగా వినిపిస్తోన్న మాట ఏంటంటే తన వందో సినిమా మనం మాదిరిగా ఓ క్లాసిక్ మూవీలా ఉంటే బాగుంటుందని ఆశ పడుతున్నారట. నాగార్జున నటించనున్న చిత్రంలో ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా భాగమవ్వాలని…ఎవరు కథ వినిపించినా? తనతో పాటు వారసుల్ని కూడా భాగం అయ్యే కథ రెడీ చేయమని పలువురికి సూచనలు కూడా చేశారు. ల్యాండ్ మార్క్ చిత్రం కాబట్టి ఈ మూవీ ఎప్పటికీ తన కెరీర్లో చిరస్థాయిగా మిగిలిపోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. మరి నాగ్ని ఎవరు ఇంప్రెస్ చేస్తారో చూడాలి.