‘ఈ సినిమాను అప్పట్లో చూసిన మీ అమ్మానాన్నలకు.. ఇప్పుడు అదే ప్రేమతో చూడబోతున్న మీకు నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నా మిత్రుడు రామ్‌గోపాల్‌వర్మకు థ్యాంక్స్. 36ఏండ్ల క్రితం ‘శివ’ తీసి నన్ను పెద్ద స్టార్‌ని చేశాడు. 4కె గా మార్చాక సినిమా చూశాను. స్టన్నింగ్‌గా, ఔట్‌స్టాండింగ్‌గా అనిపించింది. ఆరు నెలలు కష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్నీ ఒరిజినల్ సినిమా చేసినట్లుగా అద్భుతంగా డిజైన్ చేశాడు రాము. డాల్బీ అట్మాస్‌లో మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. శివ ఈజ్ ఫరెవర్. రాజమౌళి అన్నట్టు తెలుగు సినిమా అంటే ఆఫ్టర్ శివ.. బిఫోర్ శివ.. అంతే. ’ అని అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఆయన కథానాయకుడిగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో 36ఏండ్ల క్రితం విడుదలైన వెండితెర సంచలనం ‘శివ’.
తెలుగు సినిమా నడకను మార్చిన ఈ సినిమాకు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మాతలు. అమల కథానాయిక. దివంగత నటుడు రఘువరన్ ప్రతినాయకుడు. ప్రస్తుతం రీరిలీజుల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో.. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా టాలీవుడ్ కల్ట్ మూవీ ‘శివ’ సినిమాను 4k వెర్షన్‌లోకి మలచి, ఈ నెల 14న రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా 4k ట్రైలర్‌ని మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున పై విధంగా స్పందించారు.
చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ‘36ఏళ్ల తర్వాత మేమిద్దరం ఒకే స్టేజ్‌పై ఇలా మీ ముందు నిలబడి, ‘శివ’ రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ చేస్తూ మాట్లాడతామని కలలో కూడా అనుకోలేదు. ఇది ఎవర్గ్రీన్ ఫీలింగ్. ఆ రోజులాగే, ఈ రోజు కూడా సౌండ్ విషయంలో నాగ్ నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. రీ రిలీజ్ కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగించి సౌండ్‌ని చాలా బెటర్‌గా డిజైన్ చేశాం. చిరంజీవిగారు చెప్పినట్టు సినిమా ఉన్నంతవరకూ ‘శివ’ చిరస్మణీయం’ అని పేర్కొన్నారు.