“నిన్నే పెళ్లాడతా’ సినిమా తర్వాత ‘అన్నయమ్య’ చేస్తుంటే ఇప్పుడు ఇలాంటి కథలెందుకని కొందరు నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు. నాకు కొత్తదనం ఇష్టం. సెట్లో బోర్ కొట్టకుండా ఉండాలంటే వైవిధ్యభరితమైన పాత్రలు చేయాల్సిందే’ అన్నారు అగ్ర నటుడు నాగార్జున. ఆయన కీలక పాత్రలో రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఏషియన్ మల్టీఫ్లెక్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. సోమవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు లొకేష్ కనకరాజ్, శృతిహాసన్, సత్యరాజ్, సునీల్ నారంగ్, సురేష్‌బాబు, దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. నాగార్జున మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను పోషించిన ప్రతినాయకుడు ‘సైమన్’ పాత్ర దాదాపు హీరోలాంటిదే. ఈ కథ వినగానే బాగా నచ్చింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు కొన్ని మార్పులు చెబితే ఆయన వాటిని పరిగణనలోకి తీసుకొని నా పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడు.
షూటింగ్ సమయంలో రజనీకాంత్‌గారు నన్ను కలిసినప్పుడు కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయారు ‘మీరు ఇంత ఫిట్‌గా ఉన్నారని తెలిస్తే సినిమాలో వద్దని లోకేష్‌కు చెప్పేవాడిని’ అని సరదాగా అన్నారు. రజనీకాంత్‌గారి కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని సినిమాలు చేసినా ఇప్పటికీ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ సినిమా చేస్తున్న సమయంలో నేను మరింత బెటర్ యాక్టర్‌గా ఫీలయ్యాను’ అన్నారు.