తెలుగు సినీ చరిత్రలో ‘శివ’ చిత్రం కల్ట్క్లాసిక్గా నిలిచింది. అప్పటివరకు ఉన్న సినిమా గ్రామర్‌ను సమూలంగా మార్చివేసి ఫిల్మ్ మేకింగ్‌లో కొత్త పంథాకు బాటలు వేసింది. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సరికొత్త సాంకేతిక హంగులతో పునఃవిడుదలకు సిద్ధమవుతున్నది. 4కే విజువల్స్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు.
అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా రీరిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ “శివ’ నన్ను ఐకానిక్ హీరోగా నిలబెట్టింది. 35ఏళ్ల తర్వాత కూడా నేటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకే సరికొత్త టెక్నాలజీతో ముస్తాబు చేసి రీరిలీజ్‌కు సిద్ధమయ్యాం’ అన్నారు. నేటి సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా సినిమా సౌండ్‌ను మొత్తం రీడిజైన్ చేశామని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. ఆగస్ట్ 14న విడుదల కానున్న ‘కూలీ’ చిత్రంతో పాటు ‘శివ’ రీరిలీజ్ టీజర్‌ను ప్రదర్శించబోతున్నారు.