‘విడుదలకు ముందే ‘లక్కీ భాస్కర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ నమ్మకంతోనే ప్రీమియర్లు వేస్తున్నాం. నిర్మాతగా ఈ సినిమా ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు అగ్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆయన నిర్మించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. బుధవారం సాయంత్రం నుంచే ప్రీమియర్షోలు ప్రదర్శితమవుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ప్రీమియర్స్కు మంచి స్పందన వస్తుండటంతో షోస్ సంఖ్య కూడా పెంచాం. బ్యాంకింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ జోనర్లో నడిచే ఫ్యామిలీ కథాంశమిది. మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడనే పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులందరూ భాస్కర్ పాత్రతో కలిసి ప్రయాణం చేస్తారు. అతను గెలవాలని కోరుకుంటారు. ఈ సినిమాలో హీరో ఎవరినీ మోసం చేయకుండా తన తెలివితేటలతో డబ్బు సంపాదిస్తాడు. ఆ పాయింట్ ఆసక్తికంరగా అనిపిస్తుంది’ అన్నారు. ఈ సినిమాలో ఎలాంటి సందేశాలు ఉండవనీ, అయితే సినిమా చూసిన వారు మాత్రం మంచి అనుభూతితో బయటకు వస్తారని నాగవంశీ పేర్కొన్నారు.