“సార్’ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తున్నది. ప్రతి షో హౌస్‌ఫుల్ అవుతున్నదని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. నిన్న ప్రీమియర్ షోలకు కూడా ఉభయ రాష్ర్టాల్లో మంచి టాక్ వచ్చింది. ధనుష్ కెరీర్లోనే రికార్డు స్థాయి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది’ అని అన్నారు సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘సార్’. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించారు. వెంకీ అట్లూరి దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాగవంశీ మాట్లాడుతూ ‘పరిశ్రమలో చాలా మంది ఫోన్ చేసి మంచి సినిమా తీశావని అభినందిస్తున్నారు. దిల్‌రాజుగారు ఫోన్ చేసి ‘మరోసారి నువ్వు జాతీయ అవార్డుకు అప్లికేషన్ పెట్టుకునే సినిమా చేశావు. ఇలాంటి గొప్ప కథల్ని ఎంచుకో’ అని చెప్పారు. ఇక నుంచి స్ఫూర్తివంతమైన కథ అనిపిస్తే తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రీమియర్స్‌కు వచ్చిన స్పందన చూశాక సినిమా విజయంపై నమ్మకం పెరిగింది. చెన్నై వెళ్లి సినిమా చూశాను. ైక్లెమాక్స్ ఘట్టాల్ని చూస్తూ ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. తమిళంలో భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు వస్తున్న స్పందన పట్ల ధనుష్‌గారు చాలా సంతోషంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.