నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. రామ్ దేశినా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కార్తీక్ అనే యువకుడి జీవిత ప్రయాణం, లక్ష్యసాధనలో ఎదురైన సవాళ్లు, సంఘర్షణ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా సినిమా ఆకట్టుకుంటుందని, నాగశౌర్య క్యారక్టర్‌ను ప్రజెంట్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన స్పందన లభించిందని మేకర్స్ తెలిపారు. విధి, సముద్రఖని, వీకే నరేష్, సాయికుమార్, మైమ్ గోపి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జైరాజ్, నిర్మాణ సంస్థ: శ్రీవైష్ణవి ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: రామ్ దేశిన.