సినిమా పేరు : తండేల్
తారాగణం: నాగచైతన్య, సాయిపల్లవి, పృధ్వీ, రంగస్థలం మహేష్ తదితరులు..
దర్శకత్వం: చందూ మొండేటి
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాత: బన్నీవాసు
సమర్పణ: అల్లు అరవింద్
వాస్తవ సంఘటనల ఆధారంగా నాగచైతన్య, సాయిపల్లవిలతో గీతా ఆర్ట్స్ సినిమా నిర్మిస్తున్నది. దర్శకుడు చందూ మొండేటి.. అనే వార్త వచ్చిన మరుక్షణం నుంచే ‘తండేల్’ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ బాగా ఆడింది. ఇది రెండో సినిమా. అలాగే.. నాగచైతన్యతో గీతా ఆర్ట్స్ తీసిన తొలి సినిమా ‘100 పర్సంట్ లవ్’ సూపర్‌హిట్. ఇది రెండో సినిమా. ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకున్నా సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. దానికి తోడు ప్రమోషన్స్ ఓ రేంజ్లో చేశారు. దేవిశ్రీ పాటలన్నీ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ప్రతి పాట సూపర్‌హిట్. ఈ కారణాలన్నీ ‘తండేల్’పై ఆడియన్స్‌కి ఆసక్తిని రెట్టింపు చేశాయి. మరి అందరి అంచనాలనూ ‘తండేల్’ అందుకున్నాడా? అనుకున్నట్టుగా సినిమా విజయం సాధించిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకి వెళ్లాలి..
కథ
శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశ్యం గ్రామానికి చెందిన జంట రాజు(నాగచైతన్య), సత్య(సాయిపల్లవి). ఇద్దరూ మత్యకారుల కుటుంబాలకు చెందినవారే. చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగారు. కలిసి బతకాలనుకున్నారు. సత్యకు రాజు అంటే ప్రాణం. రాజుకు సత్యే లోకం. రాజు చేపల వేటకు వెళ్లి నెలల తరబడి రాకపోయినా… అతని జ్ఞాపకాలతో బతికేస్తుంది సత్య. తనవారికోసం నిలబడే తెగువ, ధైర్యం, మంచితనం.. ఇవన్నీ రాజును తమ జాతికి తండేల్గా నిలబెట్టాయ్. అయితే.. చాపలవేటకు వెళ్లి సముద్రంలో ప్రాణాలు కోల్పోతున్న తనవాళ్లను చూస్తూ సత్య మనసులో కలవరం మొదలైంది. ఎలాగైనా రాజుతో చేపలవేట మాన్పించాలని ప్రయత్నించింది. కానీ.. రాజు మాత్రం సత్య మాట వినలేదు. బాధ్యతకోసం కట్టుబడి, తనను నమ్మకున్నవారి కోసం వేటకు వెళ్లాడు. సత్య మనసు గాయపడింది. తన మాటను పెడచెవిన పెట్టిన రాజును మనసులోంచి చెరిపేయాలనుకుంది. మరొకరితో పెళ్లికి సిద్ధమైంది. ఇంతలో పిడుగులాంటి వార్త. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన రాజు బృందం.. అక్కడ తుఫాన్లో చిక్కుకొని, అందులోంచి బయట పడే ప్రయత్నంలో తమ ప్రమేయం లేకుండానే పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి పాకిస్తాన్ నేవీ అధికారులకు దొరికిపోయారు. ఈ వార్త విని మత్స్యలేశం గ్రామం విలవిలలాడింది. సత్య షాక్‌కు గురైంది. మరి పాకిస్తాన్ కరాచీ సెంట్రల్జైల్లో బంధీలుగా ఉన్న రాజు బృందం ఎలా బయటపడింది? సత్య వేరొకరిని పెళ్లాడిందా? శత్రుదేశంలో బంధీగా చిక్కుకున్న రాజుకోసం సత్య చేసిన ప్రయత్నాలేంటి? చివరకు సత్య, రాజుల ప్రేమకథ సుఖాంతమైందా? దుఖాంతంగా మిగిలిపోయిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన కథ అని ప్రచారంలో చెప్పినా.. కొత్త కథైతే కాదు. ఒక్క లైన్‌గా చెప్పుకుంటే మణిరత్నం ‘రోజా’ కథా, ఈ కథ ఒక్కటే. అయితే.. కథనం, నేపథ్యం, సినారియో, క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ డిఫరెంట్. అందుకే ఓ కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అనిపించింది. కుటుంబాల కోసం సముద్రంలోనే నెలల తరబడి జీవితాలు సాగించే మత్స్యకారులు. వారి రాకకోసం కళ్లలో వత్తులు పెట్టుకొని మరీ ఎదురుచూసే కుటుంబాలు.. ఈ నేపథ్యాల మధ్య ఓ అందమైన ప్రేమకథ.. మధ్యలో భయంకరమై కుదుపు.. దాన్నుంచి బయటపడే ప్రయత్నాలు.. మొత్తంగా ఇదే ‘తండేల్’ సినిమా. వాస్తవ సంఘటనలకు ఫిక్షన్ జోడించి దర్శకుడు చందూ మొండేటి సినిమాను తెరకెక్కించాడు.. హీరోహీరోయిన్ల ప్రేమ.. విరహం.. రొమాన్స్.. వీటితోపాటు తండేల్ రాజు పాత్రను పరిచయం చేసేందుకు కొన్ని మసాలా సీన్స్.. మొత్తంగా ఇదే ఫస్టాఫ్. పెద్దగా కథ లేకపోయినా.. విసుగైతే ఉండదు. ముఖ్యంగా సాయిపల్లవి, నాగచైన్య మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు.. వారిద్దరి కెమిస్ట్రీ.. వాటిని ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తూ దేవిశ్రీ నేపథ్య సంగీతం ఆడియన్స్‌ని కట్టిపడేస్తాయి. వీటికితోడు ప్రథమార్ధం ప్రతి పాట అద్భుతం. ఓ విధంగా ఇది దేవిశ్రీ ప్రసాద్ విశ్వరూపం. నిజానికి ఈ కథ జనాలకు తెలుసు. తెలిసిన కథను కొత్తగా తీర్చిదిద్దటం నిజంగా కత్తి మీద సామే. అయితే చందు మొండేటి అలాంటి రిస్కు తీసుకోలేదు. ఉన్న ఎమోషన్స్ చూపించడానికి తాపత్రయపడ్డాడే తప్ప, సన్నివేశాల కల్పనలో కొత్త దారులు వెతకలేకపోయారు. అందుకే సినిమా కాస్త స్లోగా నడిచింది. సెకండాఫ్‌లో రాసుకున్న దేశభక్తి సన్నివేశాలు కూడా అంత ఉత్తేజపూరితంగా లేవు. రాజు బృందాన్ని విడిపించడానికి సాయిపల్లవి చేసే ప్రయత్నాలు కూడా మనసులకు హత్తుకునేలా అనిపించవ్. అయితే.. తన జట్టులోని ఒకడ్ని కాపాడుకోడానికి పాకిస్తాన్ బోర్డర్లోకి రాజు దూసుకెళ్లే సినిమా మాత్రం హై ఇస్తుంది. మొత్తంగా ఫస్టాఫ్ సందడిగా.. సెకండాఫ్ కాస్త నిదానంగా సాగింది..
ఎవరెవరు ఎలా చేశారు.?
తండేల్రాజుగా నాగచైతన్య అద్భుతంగా చేశాడు. ఆయన మేకోవరైన విధానం.. క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసిన తీరు వండర్. ఇందులో ఓ కొత్త నాగచైతన్యను చూడొచ్చు. ఇక సాయిపల్లవి.. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సత్య పాత్రకు ప్రాణం పోసింది. మిగతా పాత్రధారులు కూడా పరిధిమేర రక్తికట్టించారు. ఇక దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. ప్రతి పాట హిట్టే. దానికి తోడు అద్భుతమైన ఆర్ఆర్. విజువల్స్ కూడా బావున్నాయి. గీతా ఆర్ట్స్ సినిమాల క్వాలిటీ, భారీ తనం ప్రస్పుటం కనిపించింది. ముఖ్యంగా సముద్రంలో తుఫాన్ సీన్ల విజువల్స్ సూపర్. కెమెరా పనితనం చాలా బావుంది. సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా బాగుంది. దర్శకుడు చందూ మొండేటి స్క్రిప్ట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఇంకా బావుంది. ఇలాంటి కథలో ఎమోషన్సే ముఖ్యం. ఆ విషయంలో కాస్త తడబడ్డాడనే అనిపించింది. చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. చిన్న చిన్న లోపాలే తప్ప సినిమా మాత్రం మంచి సినిమా. చూడాల్సిన సినిమా.. చూడదగ్గ సినిమా.
బలాలు: నాగచైతన్య, సాయిపల్లవి, దేవిశ్రీ మ్యూజిక్, విజువల్స్..
బలహీనతలు: సెకండాఫ్ కాస్త స్లో అవ్వడం.. బలహీనంగా ఎమోషన్స్..
రేటింగ్ 3/5