‘సాగర్ ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. ఓ కేసు పరిశోధన నేపథ్యంలో అతనికి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. తనకు తెలిసిన మనుషులు అనూహ్యంగా చనిపోతుంటారు. ఈ దురదృష్టకర సంఘటనలను ఆపడానికి సాగర్ ఏం చేశాడన్నదే ‘దూత’ వెబ్ సిరీస్ కథాంశం’ అన్నారు దర్శకుడు విక్రమ్ కుమార్. ఆయన దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటించిన ‘దూత’ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి.
ఈ సిరీస్ ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ ‘సూపర్ నేచురల్ అంశాలతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. జర్నలిస్టు సాగర్ జీవితంలో ఏం జరుగుతుందోనని ప్రేక్షకులు అనుక్షణం ఉత్కంఠకు గరవుతారు. మనిషి వ్యక్తిత్వ అన్వేషణతో సాగే ఓ విభిన్నమైన థ్రిల్లర్ ఇది’ అన్నారు. ‘సాగర్ వంటి భిన్న కోణాలున్న పాత్రను చేయడం ఆనందంగా ఉంది. నా కంఫర్ట్‌జోన్ నుంచి బయటకొచ్చి ఈ పాత్రను చేయడం ఓ సవాలుగా తీసుకున్నా’ అని నాగచైతన్య పేర్కొన్నారు. ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ కథానాయికలుగా నటిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మించారు.