Samantha | వైవాహిక జీవితం నుంచి విడిపోయి ఎవరి కెరీర్లో వారు ముందుకు సాగుతున్నారు నాగచైతన్య, సమంత. తమ గతం గురించి ఇటీవల నాగచైతన్య స్పందించారు. సమంత మంచిదని, ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. మీడియా తమ మధ్య దూరాన్ని పెంచిందని, దీని వల్ల మా ఇద్దరికీ పరస్పరం గౌరవం లేదనే భావన ప్రజల్లోకి వెళ్లిందని నాగచైతన్య అన్నారు. నాగచైతన్య వ్యాఖ్యలపై స్పందించింది సమంత. ఇన్స్టాగ్రామ్ డీపీ ద్వారా తన ప్రతిస్పందన తెలియజేసింది.
‘మనమంతా ఒక్కటే కానీ అహాలు, భయాలు, నమ్మకాలు మనల్ని విడదీస్తుంటాయి’ అనే అమెరికన్ శాస్త్రవేత్త నికొలే టెస్లా కొటేషన్‌ను పోస్ట్ చేసింది. దీనికి కొనసాగింపుగా ‘మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను నవ్వుతూ వెక్కిరించాలి’ అని చెప్పే మరో వీడియోను అప్లోడ్ చేసింది. నాగచైతన్య వ్యాఖ్యలకు స్పందనగానే సమంత ఈ పోస్ట్‌లు చేసినట్లు వెల్లడవుతున్నది. ప్రస్తుతం సమంత ‘ఖుషి’ చిత్రంతో పాటు ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో నటిస్తుండగా…నాగచైతన్య తన కొత్త సినిమా ‘కస్టడీ’ విడుదల సన్నాహాల్లో ఉన్నారు.