ఇటీవలే ‘కస్టడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యువ హీరో అక్కినేని నాగచైతన్య. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో చైతూ నటనకు మంచి మార్కులు పడ్డాయి. నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేయబోతున్న విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకుడు. ఇందులో నాగచైతన్య మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తారని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు చిత్ర నిర్మాత బన్నీ వాసు. మత్స్యకారుల నేపథ్యంలో కథ నడుస్తుందని..ఇందులో ఫిషింగ్ బోటు డ్రైవర్ పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని చెప్పారు. సూరత్‌లో జరిగిన ఓ యథార్థ సంఘటన స్ఫూర్తితో ఈ కథ తయారు చేశామని, ఎమోషనల్ లవ్‌స్టోరీగా మెప్పిస్తుందని బన్నీ వాసు పేర్కొన్నారు.