నాగచైతన్య ‘తండేల్’ చిత్రానికి ప్రారంభం నుంచే హైప్ మొదలైంది. సాయిపల్లవి కథానాయిక కావడం, విడుదలైన దేవిశ్రీ స్వరాలు, ఈ చిత్ర కథ.. ఇవన్నీ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. చందూ మొండేటి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. శనివారం నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ ‘తండేల్’ పవర్‌ప్యాక్డ్ యాక్షన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
లంగరు చేతపట్టి, పెనుతుఫానులో ఓడపై తడుస్తూ నిలబడ్డ ‘తండేల్ రాజు’గా నాగచైతన్యను ఈ పోస్టర్లో చూడొచ్చు. అతని ఉద్వేగపూరితమైన హావభావాలు పాత్రలోని సంకల్పాన్ని తెలియజేస్తున్నాయి. పొడవాటి జుట్టు, మ్యాసీ గడ్డంతో రగ్గ్డ్ అవతార్‌లో నాగచైతన్య కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్ దత్, సమర్పణ: అల్లు అరవింద్.
ఇదిలావుంటే.. ఓవైపు ‘తండేల్’ షూటింగ్లో బిజీగా ఉంటూ, మరోవైపు తరువాతి సినిమాకు పచ్చజెండా ఊపేశారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర(SVCC), సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చైతూ పుట్టిన రోజు సందర్భంగా ‘NC24’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. రాక్ ైక్లెంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి వున్న నాగచైతన్యను ఈ పోస్టర్లో చూడొచ్చు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం తెరకెక్కనున్నదని, డిసెంబర్లో షూటింగ్ మొదలవుతుందని మేకర్స్ తెలిపారు.