Naga Babu | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే చిరంజీవి సోదరుడు నాగబాబు మాత్రం అన్నయ్య పుట్టినరోజును వినూత్నంగా, పర్యావరణానికి మేలు చేసే విధంగా జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న నాగబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో మొక్కలు నాటి తన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆడంబరంగా వేడుకలు నిర్వహించడం కంటే పర్యావరణానికి ఉపయోగపడే పని చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.
చిరంజీవి బర్త్‌డే సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా కదంబ వృక్షం మొక్కను తెప్పించారు నాగబాబు. దీనిని హైదరాబాద్‌లోని కోకాపేటలో నాటారు. ఈ చెట్టును ‘కదంబవాసిని’గా కూడా పిలుస్తారని, సుమారు ఒకటిన్నర నుంచి రెండేళ్ల వయసున్న ఈ మొక్క వేగంగా, ఏపుగా పెరిగే లక్షణం కలిగి ఉందని తెలిపారు. కదంబ వృక్షం దట్టమైన పచ్చదనాన్ని అందించడంతో పాటు చల్లని నీడను ఇస్తుందని నాగబాబు వివరించారు. అంతేకాకుండా టెన్నిస్ బాల్ ఆకారంలో ప్రత్యేకమైన, సువాసన వెదజల్లే పూలు ఈ చెట్టుకు పూస్తాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ఇలాంటి చెట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని నాగబాబు తెలిపారు. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఒక మొక్కను నాటడం అత్యంత అర్థవంతమైన బహుమతి అని ఆయన పేర్కొన్నారు. మన ప్రియమైన వారి పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాల్లో కనీసం ఒక్క మొక్కనైనా నాటాలి. ఈ రోజు మనం చేసే చిన్న ప్రయత్నమే రేపటి తరాలకు గొప్ప బహుమతిగా మారుతుంది అంటూ నాగబాబు పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు సందేశం ఇచ్చారు. అన్నయ్య చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ.. “హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా! ఈ చెట్లలాగే మీ కీర్తి, మీ ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలి” అంటూ ప్రేమతో కూడిన సందేశాన్ని పంచుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు మెగా కుటుంబం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని నాగబాబు తెలిపారు. కుటుంబ సభ్యుల పేర్లతో ఇప్పటికే 120కి పైగా మొక్కలు నాటినట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెలతో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో కూడా మొక్కలు నాటినట్లు ఆయన పేర్కొన్నారు.