Nag Ashwin | ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన నాగ్ అశ్విన్, తన తొలి సినిమాతోనే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. వినూత్నమైన కథలు, విభిన్నమైన కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఆ తర్వాత తెరకెక్కించిన ‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లను కూడా సాధించింది. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. 2024లో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ పనుల్లో నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నారు.
ఇలాంటి సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు నాగ్ అశ్విన్. తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన భార్య ప్రియాంక గర్భవతిగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఈ సంతోషకరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నాగ్ అశ్విన్-ప్రియాంక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంట ఆనందంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.
నాగ్ అశ్విన్, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక ప్రేమకథ కూడా ఆసక్తికరంగానే సాగింది. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అనంతరం కుటుంబ సభ్యుల అంగీకారంతో 2015లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2017లో ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. తనకు దర్శకుడిగా గుర్తింపు తీసుకొచ్చిన ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలోని విజయ్ దేవరకొండ పోషించిన ‘రిషి’ పాత్ర పేరునే తన కుమారుడికి నాగ్ అశ్విన్ పెట్టడం విశేషం. ఇప్పుడు కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు రాబోతుండటంతో ఈ కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. కేవలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ నాగ్ అశ్విన్ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ‘జాతిరత్నాలు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఆయన, కొత్త తరహా కథలకు ప్రాధాన్యం ఇస్తూ నిర్మాతగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.