ఉదయ్‌శంకర్ హీరోగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. గురుపవన్ దర్శకుడు. శ్రీరామ్ మూవీస్ పతాకంపై అట్లూరి నారాయణ రావు నిర్మించారు. నేడు విడుదలకానుంది. ఈ సందర్భంగా గురువారం నిర్మాత అట్లూరి నారాయణ రావు పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘హీరో నారా రోహిత్ నాకు మంచి మిత్రుడు. ఆయన ద్వారానే డిస్ట్రిబ్యూటర్‌గా నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అనంతరం శ్రీవిష్ణుతో ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రాన్ని నిర్మించా. ఇక ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’ చిత్రంలో ఉదయ్‌శంకర్ రాజారాం అనే యువకుడు పాత్రలో అద్భుతంగా నటించాడు. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో సాగే రొమాంటిక్ సినిమా ఇది. వినోదానికి పెద్దపీట వేశాం.
కథలోని ఓ ఆసక్తికరమైన ఎలిమెంట్ అందరిని సర్ప్రైజ్ చేస్తుంది. సాధారణ ప్రేమకథలా కాకుండా యువతకు ఉండాల్సిన లక్ష్యాలు, దేశం పట్ల ప్రేమ వంటి అంశాల్ని అంతర్లీనంగా చర్చించాం. ఉదయ్‌శంకర్ నటించిన ఆటగదరా శివ, క్షణం క్షణం వంటి సినిమాలు చూశాక ఆయనతో కామెడీ, థ్రిల్లర్ సినిమా తీయాలనిపించింది. అందరూ అనుకుంటున్నట్లు ఇది రోడ్ జర్నీ మూవీ కాదు. ఆ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలుంటాయి. దర్శకుడు గురుపవన్ అనుకున్న విధంగా సినిమా చేశాడు. త్వరలో ఉదయ్‌తో మరో సినిమా చేస్తున్నాం. నారా రోహిత్‌తో ఓ చిత్రం చేయబోతున్నాం. ఓ పెద్ద హీరోతో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తాయి’ అన్నారు.