సినిమాల్లో హాట్ హాట్‌గా, టామ్ బోయ్‌లా కనిపించే నభా నటేష్‌కి వ్యక్తిగతంలో ఆధ్యాత్మిక భావాలెక్కువ. ఇటీవల తన స్వస్థలమైన శృంగేరికి వెళ్లి, అక్కడి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి, ఆ విశేషాలను, ఆ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది నభా. ఆ ఫొటోల్లో సంప్రదాయబద్ధంగా చుడీదార్ ధరించి చూడముచ్చటగా కనిపిస్తున్నది నభా నటేష్. ‘శృంగేరి నా జన్మస్థలం. మహర్షులు తపస్సు చేసిన పవిత్రభూమి ఇది.
దశరథుడితో పుత్రకామేష్టి చేయించిన ఋష్యశృంగుడికి ఈ నగరంతో అనుబంధం ఉంది. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యులవారు ఇక్కడే తొలి పీఠాన్ని స్థాపించారు. జ్ఞాన స్వరూపమైన శారదాంబ కొలువైన స్థలం ఇది. వేదాలను, కళలను నాకు పరిచయం చేసింది శృంగేరి నగరమే. చిన్నతనం నుంచి ఇక్కడే పెరగడం వల్ల ఈ స్థల ప్రభావం నాపై ఎంతో ఉంది. దట్టమైన అడవుల మధ్య, భారీ వర్షపాతానికి ప్రసిద్ధి చెందిన శృంగేరి నాకు మరపురాని జ్ఞాపకం. ఇక్కడికొచ్చిన ప్రతిసారీ చిన్ననాటి జ్ఞాపకాలు నన్ను పలకరిస్తూవుంటాయి’ అంటూ చెప్పుకొచ్చింది నభా నటేష్.