ప్రేమలు, డ్యూడ్ విజయాలతో తెలుగులోనూ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నది మలయాళ మందారం మమితా బైజు. ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతలు ఈ అమ్మడి డేట్ల కోసం క్యూ కడుతున్నారట. అయితే.. నటనకు ఆస్కారమున్న పాత్రలకు మాత్రమే ఈ అందాలభామ ఓకే చెబుతున్నదట. ఇదిలావుంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది మమితా. ‘మా నాన్నకు ఓ క్లీనిక్ ఉండేది. నేను ఆ క్లీనిక్‌కి వెళ్లినప్పుడల్లా.. అంతా నన్ను బేబీ డాక్టర్ అని పిలిచేవారు.
వ్యాధి నయమైన వాళ్లు నాన్నకు కృతజ్ఞతలు చెప్పడం చూసి గర్వించేదాన్ని. నాన్నలా నేనూ డాక్టర్ కావాలనుకునేదాన్ని. కానీ అనుకోకుండా సినిమాల్లోకొచ్చాను. నా కల చెదిరిపోయింది. 9వ తరగతి చదువుతున్న సమయంలో ‘సర్వోపకారి బాలక్కాన్’ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రనిర్మాత నాన్న ఫ్రెండ్ కావడంతో, నటించమని ఫోర్స్ చేశారు. దాంతో నటించక తప్పలేదు. ఆ తర్వాత ఆడిషన్స్‌కి వెళ్లడం, స్టేజ్ ప్లేలు.. ఇలా నిదానంగా నటన అలవాటైపోయింది. ఇప్పుడు మేకప్ లేకుండా ఉండలేని పరిస్థితి.’ అంటూ గతాన్ని నెమరు వేసుకున్నారు మమిత బైజు.