Music Director | సౌత్ ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్, కోలీవుడ్,బాలీవుడ్లో సత్తా చాటుతూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతని పాటలు వింటే సంగీత ప్రియులు మైమరచిపోతుంటారు. ఇప్పటికే భారీ విజయాలతో దూసుకెళ్తున్న అనిరుధ్‌కు ఈ జూన్ నెల మరింత ప్రత్యేకంగా మారబోతుంది. ఎందుకంటే, ఈ నెలలో ఆయన అందించిన నాలుగు క్రేజీ సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ముందుగా రజనీకాంత్ నటించిన కూలి చిత్రం.ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే బిట్ సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నా, ఇప్పటి వరకు ఫస్ట్ సింగిల్ రాలేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ వారం తొలి పాటను రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన.
మరోవైపు దళపతి విజయ్ పూర్తి రాజకీయాలలోకి వెళ్లే ముందు చేస్తున్న చివరి సినిమా “జననాయకన్”. ఈ సినిమాకు కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ గ్లింప్స్ ఓ ఫీస్టే అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మూడోది ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో, శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా “మదరాసి”. ఇది సెప్టెంబర్ 5న విడుదల కానుండగా, జూన్ లోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో మురుగదాస్‌తో అనిరుధ్ చేసిన కత్తి, దర్బార్ మంచి విజయం పొందిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఉన్నాయి.
ఇక విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కింగ్డమ్” సినిమా కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్లోనే తెరకెక్కుతోంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా, సినిమాను జూలై లేదా ఆగస్టులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. జూన్‌లో రెండో సింగిల్ విడుదలకు ప్లాన్స్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నాలుగు పెద్ద సినిమాలతో పాటు అనిరుధ్ చేతిలో మ్యాజిక్, ది ప్యారడైజ్, జైలర్ 2 వంటి సినిమాలున్నాయి. ఇప్పటికే జూన్ నెలలో రెండు వారాలు పూర్తి కాగా, మిగతా రెండు వారాల్లో సౌత్ ఇండస్ట్రీ మొత్తం అనిరుధ్ మ్యూజిక్ మాయలో మునిగిపోవడం ఖాయం!