Munnabhai MBBS | బాలీవుడ్లో ఫ్రాంచైజీ ట్రెండ్ వేగవంతం అయ్యింది ‘మున్నాభాయ్’ నుంచే. సంజయ్‌దత్ కథానాయకుడిగా రూపొందిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగేరహో మున్నాభాయ్’ చిత్రాలు అఖండ విజయాలను అందుకున్నాయి. అంతేకాదు, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ‘మున్నాభాయ్’ కథ రీమేక్ అయి, విజయాలను అందుకున్నది. ఇప్పటికీ ఈ ఫ్రాంచైజీకి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తికాదు. ఈ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ‘మున్నాభాయ్-3’కి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ.
మూడో పార్ట్ కోసం కసరత్తు చేస్తున్నామని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని ఇటీవలే ఆయన వెల్లడించడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పెద్ద పెద్ద హీరోలు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక సంజయ్‌దత్ విషయానికొస్తే.. ఆయన దాదాపు హీరోగా ఫేడ్ అవుట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో హిరానీ ‘మున్నాభాయ్ 3’ని ప్రకటించడం విశేషం. గత రెండు పార్ట్ ల కంటే మెరుగ్గా ఈ సినిమా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు రాజ్‌కుమార్ హిరానీ తెలిపారు.