నటి శార్వారీ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ అందాల భామ ‘బంటి ఔర్ బబ్లీ 2’తో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. కేవలం ఒకే ఒక్క సినిమాతో దర్శక, నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు బాలీవుడ్‌కి చెందిన అతిపెద్ద ఫ్రాంజైజీల్లో ఈ ముద్దుగుమ్మ భాగం అయ్యింది. ఆదిత్య చోప్రా ఫిల్మ్స్ యూనివర్స్ రూపొందిస్తున్న స్పై యూనివర్స్‌లో శార్వారీ నటించనుంది. అలాగే, దినేష్ విజన్ దర్శకత్వంలో ఈ అందాలభామ నటించిన హారర్ కామెడీ చిత్రం ‘ముంజ్యా’ ఈనెల 7న విడుదల కానుంది.
ఈ సినిమాల గురించి ఆమె మాట్లాడుతూ ‘ నటిని కావడం నా కల. అయితే.. ఈ స్థాయికి చేరుకుంటానని మాత్రం అనుకోలేదు. నిజానికి నా కష్టం సామాన్యమైనది కాదు. దినేష్ విజన్ హారర్ కామెడీ యూనివర్స్తోపాటు, ఆదిత్యచోప్రాగారి యష్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్‌లో కూడా అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఒక్క సినిమాతోనే సూపర్‌స్టార్స్‌తో నటించేంత గుర్తింపు రావడం బహుశా చాలా తక్కువ మందికి జరుగుతుందేమో’ అంటూ ఆనందం వెలిబుచ్చింది. ఇదిలావుంటే నిఖిల్ అద్వానీ తెరకెక్కించబోతున్న ‘వేద’ సినిమాలోనూ కథానాయికగా శార్వారీనే ఎంపికచేయడం విశేషం.