Multi Starrer | బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ అంటే టాలీవుడ్లో మాస్ హంగామాకి తిరుగుండదు. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత వస్తున్న ‘అఖండ 2’ మీద ప్రేక్షకుల్లో అఖండ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. బాలయ్య దేవదూతగా మారి చూపించిన ఉగ్రరూపం, బోయపాటి స్టయిల్ యాక్షన్ సన్నివేశాలు, భారీ విజువల్స్, పవర్ ప్యాక్డ్ డైలాగులు అన్ని ట్రైలర్‌ను పాన్ ఇండియా హంగామాగా మార్చేశాయి. విడుదలైన కొద్ది గంటల్లోనే #Akhanda2Trailer జాతీయ స్థాయిలో ట్రెండ్ అవ్వడం ఈ సినిమాపై ఉన్న మాస్ క్రేజ్‌కు నిదర్శనం.
ముంబైలో విడుదల చేసిన ఫస్ట్ సాంగ్‌కు వచ్చిన అద్భుత స్పందన, వైజాగ్‌లో జరిగిన రెండో సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన భారీ జనసందోహం సినిమా మీద బజ్ మరింత పెరగడానికి కారణమైంది. ఇక శుక్రవారం రాత్రి కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్‌లో శివ రాజ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న శివన్న… “బోయపాటిగారు నన్ను, బాలయ్యగారిని ఒకే సినిమాలో చేస్తే నేను రెడీ”అని ప్రకటించగా… బాలయ్య కూడా వెంటనే “మేము కూడా రెడీ” అని చిరునవ్వుతో స్పందించారు.
దీనిపై బోయపాటి శ్రీను కూడా డబుల్ రెడీ సార్! అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో మాస్ ఫ్యాన్స్ అంతా గోల చేశారు..ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో “బాలయ్య , శివరాజ్ కుమార్, బోయపాటి కలిస్తే మాస్ సునామి గ్యారెంటీ అని కామెంట్ చేస్తున్నారు. అయితే సినీ వర్గాల ప్రకారం, ఇలాంటి మాటలు ఈవెంట్లలో సాధారణమే. ఒక భారీ మల్టీస్టారర్ సెట్స్‌పైకి రావాలంటే సమాన ప్రాముఖ్యత, స్క్రీన్ బ్యాలెన్స్, స్క్రిప్ట్ డిమాండ్ వంటి అనేక ఈక్వేషన్స్ సరిపోవాలి. ఇక బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్‌తో మొదలైన హైప్ రిలీజ్ వరకూ ఎలా ఉంటుందో చూడాలి