ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాభిమానం చూరగొన్న ‘ది లయన్ కింగ్’ సిరీస్‌లో భాగంగా రాబోతున్న చిత్రం ‘ముఫాసా: ది లయన్‌కింగ్’. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. వివిధ భారతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. సినిమాలోని ప్రధాన పాత్ర ముఫాసాకు అగ్ర హీరో మహేష్‌బాబు వాయిస్ ఓవర్ అందిస్తున్న విషయం తెలిసిందే.
సోమవారం తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదల చేశారు. ‘అప్పుడప్పుడూ ఈ చల్లనిగాలి.. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తుంది. అంతలోనే మాయమవుతుంది’, ‘మనం ఒక్కడిగా పోరాడాలి..’ అంటూ మహేష్‌బాబు చెప్పిన సంభాషణలు ట్రైలర్లో హైలైట్‌గా నిలిచాయి.
తాను ఎంతగానో ఇష్టపడే పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉందని మహేష్‌బాబు సోషల్‌మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో మరో రెండు పాత్రలకు బ్రహ్మానందం, అలీ డబ్బింగ్ చెప్పడం విశేషం.