MSG | ఈ సంక్రాంతికి విడుదల కానున్న భారీ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకరవరప్రసాద్ గారుపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడితో చిరంజీవి కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్ మొదటినుంచే ఆసక్తిని రేపింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. జనవరి 4న రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో రెండో స్థానంలో నిలవడం విశేషం. ట్రైలర్ మొత్తం అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు వింటేజ్ చిరంజీవిని చూపిస్తూ సాగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ ఎలివేషన్లు వినిపిస్తుండగా, స్క్రీన్‌పై మాత్రం సాధారణ కుటుంబ వ్యక్తిలా చిరంజీవి కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇంటిలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటూ భారీ ఇమేజ్ బిల్డ్ చేస్తూ, అదే సమయంలో బట్టలు ఉతకడం, వంట చేయడం వంటి సీన్లు హాస్యాన్ని పండించాయి.చిరంజీవి – నయనతార మధ్య లవ్ సీన్లు, పెళ్లి తర్వాత భార్య టార్చర్‌పై చిరు చూపించే ఫ్రస్టేషన్ కామెడీగా వర్కౌట్ అయ్యింది. అత్తగారు, మామగారి కామెడీ ట్రాక్ కూడా ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక చివర్లో హెలికాప్టర్లో వెంకటేష్ ఎంట్రీ ప్రేక్షకులకు అదిరిపోయే మాస్ ఫీల్ ఇచ్చింది. చిరు – వెంకీ మధ్య డైలాగ్ ఎక్స్చేంజ్ ట్రైలర్‌కు హైలైట్‌గా మారింది.చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించగా, కేథరీన్ థెరిసా కీలక పాత్ర పోషిస్తోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.