MSG | మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’పై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నయనతార కథానాయికగా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో కనిపించనుండటం సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి. మెగాస్టార్‌ను అనిల్ రావిపూడి స్టైల్ ఎంటర్టైన్మెంట్లో చూడబోతున్నామన్న ఉత్సాహంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అన్ని హంగులు పూర్తి చేసుకున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన రిలీజ్ ఏర్పాట్లకు వేగం పెరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ప్రీమియర్ షోలను నిర్వహించడంతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. రిలీజ్‌కు ఒక్కరోజు ముందు, అంటే జనవరి 11న ఈ మెగా మూవీకి స్పెషల్ ప్రీమియర్స్ నిర్వహించనున్నారు. ఈ షోలకు టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ ప్రీమియర్ షోలను ప్రదర్శించాల్సి ఉంటుంది.
అలాగే జనవరి 12 నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కాలంలో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.100 వరకు, మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి రూ.125 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు, రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి ఇవ్వడం గమనార్హం. దీంతో సంక్రాంతి సీజన్లో ఈ సినిమా థియేటర్లలో భారీ సందడి చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, అభినవ్ గోమరం, సచిన్ ఖేడ్కర్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సంగీతం అందించగా, ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటున్నాయి.