MSG | మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కుటుంబమంతా కలిసి చూసే వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజాగా వెంకీ పాత్రపై ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో నయనతార పోషిస్తున్న పాత్ర రెండో పెళ్లి చేసుకోవడానికి వచ్చే మరో హీరో పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నాడని సమాచారం. అయితే కథలో ఇప్పటికే వెంకటేష్, చిరంజీవి పాత్రల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండటం, ఆ విషయం తెలియని నయనతార పాత్రతో ఈ ఇద్దరూ నడిపే డ్రామా ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తుందని తెలుస్తోంది. చిరు–వెంకీ మధ్య వచ్చే సీన్స్, డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరో విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో చిరంజీవి 25 ఏళ్ల క్రితం ఉన్నంత స్లిమ్‌గా, యంగ్‌గా కనిపించనున్నారని సమాచారం. ఇది ఇప్పటికే ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి టైమింగ్, వెంకటేష్ చలాకీతనం కలిసి ఈ సినిమా ఏ స్థాయి వినోదాన్ని అందిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా స్పందిస్తూ, ఇది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం అని, కథ తనకు చాలా నచ్చిందని చెప్పారు. మొత్తం మీద ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిరంజీవి కెరీర్లో మరో హిట్ ఎంటర్టైనర్గా నిలుస్తుందనే అంచనాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో పాటు పలు చిత్రాలు పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. అన్ని సినిమాలపై భారీ అంచనాలు ఉండగా, మన శంకర వరప్రసాద్ గారు చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించనుందని అంటున్నారు. చిరంజీవికి కూడా చాలా కాలం నుండి మంచి హిట్స్ రాలేదు. ఈ క్రమంలో మన శంకరవర ప్రసాద్ గారు మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.