MSG | మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సంక్రాంతి బరిలో విడుదలై తెలుగు బాక్సాఫీస్‌కు కొత్త జోష్ తీసుకొచ్చింది. వింటేజ్ చిరంజీవిని మరోసారి ప్రేక్షకులకు దగ్గర చేసిన ఈ సినిమా విడుదలైన తొలి వారం రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్లింది. అయితే రెండో వారం అడుగుపెట్టిన తర్వాత వీక్‌డేస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నా… మొత్తంగా చూస్తే సినిమా బాక్సాఫీస్ పరంగా ఇంకా బలంగానే నిలుస్తోంది. సంక్రాంతి సెలవుల కారణంగా తొలి వారం థియేటర్లు హౌస్‌ఫుల్‌గా మారాయి. కుటుంబ ప్రేక్షకులు, చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడంతో వసూళ్లు ఆకాశాన్ని తాకాయి.
రెండో వారం ప్రారంభం నుంచే పండుగ ఎఫెక్ట్ తగ్గడంతో డైలీ కలెక్షన్లలో తగ్గుదల కనిపిస్తోంది. అయినా కూడా ఇతర సంక్రాంతి విడుదలతో పోలిస్తే ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ఇప్పటికీ లీడర్‌గానే కొనసాగుతోంది. సక్నిల్క్ ఎర్లీ ట్రెండ్ ప్రకారం, విడుదలైన రెండో బుధవారం (10వ రోజు) ఈ సినిమా సుమారు రూ.4 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. వీక్డేస్కు ఇది గౌరవప్రదమైన నెంబర్‌గా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో 10 రోజులకు మొత్తం నెట్ కలెక్షన్ రూ.175 కోట్లకు పైగా చేరింది. ఈ సినిమా మొదటి వారం రూ.157.75 కోట్ల నెట్ వసూలు చేసి, పాన్ ఇండియన్ సినిమాలను మినహాయిస్తే తెలుగు చిత్రాల్లో కొత్త రికార్డును సృష్టించింది. గతంలో ‘సైరా నరసింహారెడ్డి’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాల ఫస్ట్ వీక్ నెంబర్లను దాటేసింది. ఇది చిరంజీవి మార్కెట్ స్టామినా ఇప్పటికీ ఎంత బలంగా ఉందో నిరూపిస్తోంది.
రెండో వారం వీక్‌డేస్‌లో వసూళ్లు తగ్గినా, రిపబ్లిక్ డే సెలవులు సినిమాకు మరో బూస్ట్ ఇవ్వనున్నాయని అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే 200 కోట్ల నెట్ క్లబ్‌లోకి ఈ సినిమా త్వరలోనే అడుగుపెట్టే అవకాశం ఉంది. మొత్తంగా…‘మన శంకర్ వరప్రసాద్ గారు’ పండుగ సీజన్ బెనిఫిట్‌తో పాటు చిరంజీవి వింటేజ్ అప్పీల్‌ను పూర్తిగా క్యాష్ చేసుకుంది. వీక్‌డేస్ డ్రాప్ సహజమే అయినా, ఇప్పటి వరకూ వచ్చిన కలెక్షన్లు ఈ సినిమాను సంక్రాంతి రేస్‌లో స్పష్టమైన విజేతగా నిలబెడుతున్నాయి. చిరు ఖాతాలో మరో బలమైన బాక్సాఫీస్ విజయం చేరిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.