Mrunal Thakur | ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్. అభినయంతో పాటు సహజ సౌందర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది. చాలామంది బయటకు వచ్చిన సందర్భాల్లో మేకప్ లుక్‌లో కనిపిస్తుంటారు. కానీ, వారికి భిన్నంగా మృణాల్ మాత్రం నేచురల్‌గానే కనిపిస్తుంది. ఈ బ్యూటీ చర్మం ఎప్పుడూ కాంతివంతంగానే మెరుస్తూ ఉంటుంది. అయితే, తన బ్యూటీ సీక్రెట్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది.
ఈ వీడియోలో మృణాల్ తాను రాత్రి పడుకునే ముందు ముఖానికి ఓ ఆయిల్‌ను అప్లయ్ చేసుకుంటానని చెప్పింది. ఆ ఆయిల్ వాడటాన్ని తన తల్లి సలహాతోనే ప్రారంభించానని చెప్పింది. అదే విషయాన్ని తల్లిని అడిగి మరింత వివరించాలన కోరింది. ఇంతకీ ఆ నూనే ఖరీదైన దేమీ కాదు. అందరూ వినియోగించే బాదం నూనే అని చెప్పింది. తన తల్లి సూచించిన ఈ చిట్కా తన చర్మానికి విశేషమైన కాంతిని ఇస్తుందని మృణాల్ చెప్పుకొచ్చింది.
బాదం నూనెలో విటమిన్-ఈ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు, ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది సహజ మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. అంతేకాక, యాంటీ-ఏజింగ్ లక్షణాలు ఉండటం వల్ల చర్మం యువకంగా కనిపించడానికి తోడ్పడుతుంది. వయస్సు ప్రభావాలు తొందరగా కనిపించకుండా అడ్డుకుంటుంది. ఇక కళ్ల కింద కనిపించే నలుపు వలయాలు, చర్మం ఉబ్బినట్లు కనిపించే సమస్యలకు కూడా బాదం నూనె సమర్ధంగా పని చేస్తుంది. ఆ భాగంలో మృదువుగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మృణాల్ ఖరీదైన కొనుగోలు చేయడం ఏమాత్రం నచ్చదట. ఖరీదైన బట్టలు కొనుగోలు చేసినా వాటితో ఎలాంటి ఉపయోగం లేకుండా దాచి ఉంచాల్సి వస్తుందని అభిప్రాయపడింది. ఇప్పటి వరకు తాను కొనుగోలు చేసిన ఖరీదైన డ్రెస్ రూ.2వేలు మాత్రమేనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. స్టార్ హీరోయిన్ అయినా తక్కువ ధరల్లోనే డ్రెస్‌లు కొనుగోలు చేస్తానని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ మూవీ ఈవెంట్స్, ఇతర ఫంక్షన్లకు హాజరైన సందర్భంలోనే ఖరీదైన వస్త్రాలను ధరిస్తుండగా.. వాటిని రెంట్ తీసుకొని ధరిస్తుందట. భారీ ధర దుస్తులను కొనుగోలు చేయడం నచ్చదని.. బదులుగా ఆ డబ్బులను ఫుడ్, ప్రాపర్టీస్ కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తానని చెప్పడం విశేషం. మృణాల్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
మృణాల్ మరాఠి కుటుంబంలో పుట్టి పెరిగింది. 2012 ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కెరియర్ ప్రారంభంలో టీవీల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోకి ‘సీతారామం’తో పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించడంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ పేరు మారుమోగింది. అయితే, అవకాశాలు మాత్రం ఎక్కువగా రాలేదు. టాలీవుడ్లో మృణాల్ ఠాకూర్ నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టర్ సినిమాల్లో నటించింది. ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ప్రస్తుతం తెలుగులోకి అడివి శేష్ డెకాయిట్ : ఏ లవ్ స్టోరీతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం AA22xA6లో కీలక పాత్రలో నటించనున్నది. మరో రెండు హింద్రీ చిత్రాల్లో నటించనున్నది.