Mrunal Thakur | మరాఠీ చిత్రాల ద్వారా కథానాయికగా అరంగేట్రం చేసిన మృణాల్ ఠాకూర్.. ఆ తర్వాత హిందీలో ‘లవ్ సోనియా’ ‘సూపర్ 30’వంటి సినిమాల్లో తనదైన అభినయంతో మెప్పించింది. తెలుగులో ‘సీతారామం’ఈ భామ కెరీర్‌కు బ్రేక్‌నిచ్చింది. తాజాగా ఆమె ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. త్వరలో ఆస్ట్రేలియాలో జరుగనున్న ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’లో డైవర్సిటీ ఇన్ సినిమా అవార్డుకు ఎంపికైంది.
భిన్న భారతీయ భాషల్లో ప్రశంసాత్మక పాత్రల ద్వారా మృణాల్ ఠాకూర్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందని అవార్డుల కమిటీ పేర్కొంది. ఈ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని స్ఫూర్తివంతమైన పాత్రల్లో నటించడానికి ప్రేరణనిస్తుందని మృణాల్ ఠాకూర్ పేర్కొంది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగులో విజయ్ దేవరకొండ, నాని చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.