అగ్రహీరో రవితేజ తమ్ముడి తనయుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రాన్శర్మ కథానాయిక. గౌరీ రోణంకి దర్శకత్వంలో జె.జె.ఆర్.రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌లో సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా రీసెంట్గా విడుదల చేసిన ‘కాంతారా కాంతారా..’ సాంగ్, ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని ధృవ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్‌లో జరిపారు. తమ ఆనందాన్ని కళాశాల విద్యార్థులతో చిత్ర టీమ్ షేర్ చేసుకున్నారు. ఇదే కాలేజ్‌లో ఈ సినిమా షూటింగ్ జరిపామనీ, ఆ క్షణాలు తన జీవితంలో మరిచిపోలేనివని హీరో మాధవ్ అన్నారు. షూటింగ్ టైమ్‌లో మీరంతా ఎంతో సహకరించారనీ, సినిమా మీకందరికీ నచ్చుతుందనీ డైరెక్టర్ గౌరీ రోణంకి నమ్మకం వెలిబుచ్చారు. టీమ్ అంతా ప్రాణంపెట్టి పనిచేశారని, హీరో మాధవ్ భవిష్యత్‌లో పెద్ద స్టార్ అవుతాడని నిర్మాత జె.జె.ఆర్.రవిచంద్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా కథానాయిక సిమ్రాన్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రంగస్థలం మహేశ్ కూడా మాట్లాడారు.