Mowgli | యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ 2025’ ఇప్పుడు ఓటీటీ బాట పట్టేందుకు సిద్ధమైంది. దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్లో సాక్షి మడోల్కర్ హీరోయిన్గా నటించగా, బండి సరోజ్ స్పెషల్ రోల్లో కనిపించారు. డిసెంబర్ 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాపై ముందుగా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విడుదల తర్వాత ఆ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోవడంతో, బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్‌తో సరిపెట్టుకుంది.ఈ నేపథ్యంలో ‘మోగ్లీ 2025’ ఓటీటీ స్ట్రీమింగ్పై మేకర్స్ దృష్టి పెట్టారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 నుంచి ‘మోగ్లీ 2025’ను స్ట్రీమింగ్ చేయనుంది. దీనిపై ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేయడంతో, ఓటీటీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ, ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా లవ్, ఎమోషనల్ కంటెంట్ ఓటీటీకి అనుకూలంగా ఉండటం ‘మోగ్లీ 2025’కు ప్లస్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తానికి థియేటర్లలో యావరేజ్‌గా నిలిచిన ‘మోగ్లీ 2025’, ఓటీటీలో మాత్రం సూపర్ హిట్‌గా మారుతుందా? అన్నది జనవరి 1 తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది. చిత్రంలో వైవా హర్ష, కృష్ణ భగవాన్, మౌనిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం సుమ తనయుడు చాలానే కష్టపడ్డాడు. మరి ఓటీటీలో అయిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.