Mothers Day Special Telugu Songs | అమ్మ కంటే కమ్మనైన పదం ఈ సృష్టిలోనే లేదని ఎందరో కవులు వర్ణించారు. ‘అమ్మకు మించిన దైవం ఉన్నాదా’ అని సినారే దైవం కంటే కూడా అమ్మే గొప్పదని చెప్పినా… ‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ’ అంటూ చంద్రబోస్ అమ్మను దేవతతో పోల్చూతూ.. ‘సృష్టి కర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ’ అంటూ సిరివెన్నెల సృష్టికి మూలం అమ్మ అని గొప్పగా వర్ణిస్తూ.. ఇలా అమ్మ ప్రేమను, అప్యాయతను, అనురాగాన్ని చెప్పడానికి ఎన్ని వేల పదాలైన, ఎన్ని లక్షల మాటలైన కొత్తగానే అనిపిస్తుంటాయి. ఈ లోకంలో మనిషిని కదిలించే వాటిలో అమ్మను మించింది మరొకటి లేదు. అందుకే అమ్మకు సంబంధించిన పాటలు ఎన్ని వచ్చినా మనం ఇట్టే కనెక్ట్ అయిపోతాం. ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా.. వెండితెరపై అమ్మ పేరును జపిస్తూ, అమ్మ గొప్పతనాన్ని కీర్తిస్తూ తెలిపిన పాటలేంటో ఓ లుక్కేద్దాం.
అమ్మ పాటలు అనగానే ముందుగా గుర్తోచ్చే పాట ‘అమ్మకు మించిన దైవం ఉన్నాదా’ అనే పాట. సి. నారాయణ రెడ్డి గారు సాహిత్యం అందించిన ఈ పాట ఒక అద్భుతం. అమ్మ గొప్పతనాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరైనా వర్ణించగలరా అనే స్థాయిలో ఈ పాట సాహిత్యం ఉంటుంది. అంతే గొప్పగా బాల సుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు ఈ పాటను ఆలపించారు.
‘ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం’ అంటూ సిరివెన్నెల కలం నుంచి వచ్చిన ఈ పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవతార మూర్తయిన అమ్మపేగు తెంచుకునే అంతటి వాడవుతాడు అనే ఈ ఒక్క వాక్యం చాలదు అమ్మ గొప్పతనం గురించి సిరివెన్నెల ఎంత గొప్ప రాశాడో అని.
‘సృష్టి కర్త ఒక బ్రహ్మ.. అతనిని సృష్టించినదొక అమ్మ’ అంటూ అదే మాతృదేవోభవ సినిమాలో సిరివెన్నెల సాహిత్యం అందించిన మరో అద్భుతం ఈ పాట. అంతే అద్భుతంగా కే.జే ఏసుదాసు ఆలపించాడు.
‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ’ అంటూ చంద్రబోస్ ఈ సృష్టిలోనే అమ్మకు మించిన గొప్ప పదం లేదని, కళ్ల ముందు కదిలే దేవత అమ్మని గొప్పగా వర్ణించాడు. ఏ.ఆర్ రెహమాన్ ట్యూన్ అమోగం. ఎన్ని సార్లు విన్నా.. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటల్లో ఇదొకటి.
‘జన్మిస్తే మళ్లీ నీవై పుడతాలే.. ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతానే’ అంటూ సృష్టిలో అమ్మ పాత్ర ఎలాంటిదో ఈ పాటలో చక్కగా వర్ణించారు. కనిపించకపోతే బెంగై వెతికేవే.. కన్నీరే వస్తే కొంగై తుడిచావే అంటూ రచయిత పెద్దాడ మూర్తి తల్లికి బిడ్డ మీద ప్రేమను గొప్పగా చెప్పాడు.
‘ఎదగర ఎదగర దినకర.. జగతికే జ్యోతిగా నిలవరా’ అంటూ కొడుకును లోకానికి వెలుగవమని రామజోగయ్య శాస్త్రీ వర్ణించిన తీరు అమోగం. ఈ పాట సాహిత్యం మొత్తం ఒక తల్లి తన కొడుకును ఏ విధంగా చూడాలనుకుంటుంది. ఎంతటి మహనీయుడుని చేయాలని అనుకుంటుందని ఉంటుంది.
‘నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మా.. నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా’ .. అంటూ అమ్మ ప్రేమను మిస్సవుతున్న ఓ కొడుకుకి మళ్లీ అమ్మ ప్రేమను పొందే అవకాశం వస్తే ఎంత గొప్పగా ఉంటుందో అని సిరివెన్నెల ఈ పాటలో చక్కగా వర్ణించారు. అంతే అందగా సిద్ శ్రీరామ్ ఈ పాటలను ఆలపించాడు. ఇవే కాకుండా అమ్మ కీర్తిని తెలియజేసే పాటలు ఎన్నో తెలుగు సినిమాల్లో ఉన్నాయి.
Tollywood, Telugu Cinema News