IMDB | సినిమాలకు సంబంధించి రేటింగ్, సమాచారం విషయంలో అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDb), 2025 సంవత్సరానికి గానూ అత్యంత ప్రజాదరణ పొందిన (Most Popular) భారతీయ స్టార్లు మరియు దర్శకుల జాబితాను తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను రూపొందించింది. అయితే ఈ జాబితాలో తెలుగు నుంచి ఒక్క దర్శకుడు కూడా చోటు దక్కించుకోకపోవడం విశేషం. ఇక ఐఎండీబీ విడుదల చేసిన డేటా ప్రకారం ఈ ఏడాది మోస్ట్ పాపులర్ దర్శకులు ఎవరు అనేది చూసుకుంటే.
సైయారాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మోహిత్ సూరి (Mohit Suri) ఈ ఏడాది మోస్ట్ పాపులర్ దర్శకులలో అగ్ర స్థానంలో నిలిచాడు. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌తో ఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచాడు. కూలీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) మూడో స్థానంలో నిలువగా.. నిశాంఛీతో హిట్ అందుకున్న అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) నాలుగో స్థానంలో ఎల్ 2 ఎంపురాన్ సినిమాతో హిట్ అందుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఐదో స్థానంలో నిలిచారు. ఆమిర్ ఖాన్‌తో సితారే జమీన్ పర్ లాంటి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ఆర్.ఎస్. ప్రసన్న (R.S. Prasanna) ఆరో స్థానంలో నిలువగా.. మెట్రో ఇన్ డినోతో అనురాగ్ బసు (Anurag Basu) ఏడో స్థానంలో నిలిచాడు. మలయాళం కొత్త లోక సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు డొమినిక్ అరుణ్ (Dominic Arun) ఎనిమిదో స్థానంలో చోటు దక్కించుకోగా.. ఛావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) 9వ స్థానం, హోమ్ బౌండ్ చిత్రంతో నీరజ్ ఘైవాన్ (Neeraj Ghaywan) 10వ స్థానంలో చోటు దక్కించుకున్నాడు.