Rana |బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణే ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. రోజుకు ఎనిమిది గంటల పని చాలు… అతిగా వర్క్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు అని ఆమె చెప్పిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా ప్రసవం తర్వాత వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌పై ఆమె చేసిన సూచనలు, ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యల కారణంగా ఆమెను ‘స్పిరిట్’, ‘కల్కి 2’ ప్రాజెక్టుల నుంచి తప్పించేశారని వచ్చిన వార్తలు మరింత వివాదాన్ని రేకెత్తించాయి. జీవితం–పని మధ్య బ్యాలెన్స్ చాలా అవసరం అని దీపిక చెప్పిన మాటలకి పలువురు సెలబ్రిటీలు ఆమెకు మద్దతు తెలిపారు. మనసు, శరీరం ఒత్తిడిలో ఉన్నప్పుడు మంచి అవుట్‌పుట్ సాధ్యం కాదు అని కూడా ఆమె స్పష్టం చేశారు.
అయితే ఈ వివాదంపై నటుడు దగ్గుబాటి రానా తాజాగా స్పందించారు. సినిమా ఇండస్ట్రీ సాధారణ ఉద్యోగం కాదు. నటన ఒక లైఫ్‌స్టైల్… ఎనిమిది గంటలు కూర్చొని అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చే ఫీల్డ్ ఇది కాదు అని రానా వెల్లడించారు. ఒక మంచి సీన్ రావాలంటే కెమెరా నుంచి లైటింగ్ వరకు, నటీనటులు నుంచి టెక్నీషియన్ల వరకూ అందరూ సమయం పట్టించుకోకుండా అంకితభావంతో పని చేస్తారని ఆయన అన్నారు. “ఇక్కడ 8 గంటల రూల్ ప్రాక్టికల్‌గా చాలా కష్టం అని స్పష్టం చేశారు. నటుడు దుల్కర్ సల్మాన్ కూడా ఈ విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
వివిధ పరిశ్రమలలో వర్క్ మోడల్ ఒక్కో రకంగా ఉంటుంది. తెలుగులో మహానటి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సాయంత్రం ఆరు గంటలకే షూటింగ్ అయిపోయేది. తమిళంలో పరిస్థితి కొంచెం వేరుగా ఉంటుంది. ఆదివారాలు కూడా సెలవు ఇస్తారు. ఒక రోజు అతిగా పనిచేయడం కంటే, రోజూ కొంచెం అదనంగా పనిచేయడం బెస్ట్ అని దుల్కర్ స్పష్టం చేశారు. ఇండస్ట్రీ ధోరణి, ప్రాజెక్ట్ డిమాండ్స్ మీద వర్కింగ్ అవర్స్ ఆధారపడి ఉంటాయి అని ఆయన స్పష్టం చేశారు. దీపికా పదుకొణే వ్యాఖ్యలపై రానా–దుల్కర్ స్పందించడంతో సినీ పరిశ్రమలో వర్కింగ్ అవర్స్‌పై చర్చ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.