నందమూరి అభిమానులు సుదీర్ఘంగా నిరీక్షిస్తున్న క్షణం రానే వచ్చింది. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి చిత్రానికి రంగం సిద్ధమైంది. గత కొన్నేళ్లుగా వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ఆదివారం నందమూరి మోక్షజ్ఞ అరంగేట్ర చిత్రం తాలూకు ప్రకటన వెలువడింది. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించబోతున్నారు.
ఆదివారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన్ని కలిసి శుభాకాంక్షలు అందజేశారు. ‘కూన గుహను వీడింది. సింహంలా అడవిలోకి అడుగుపెట్టింది. హ్యాపీబర్త్‌డే మోక్షజ్ఞ’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. సినిమా ఎంట్రీ విషయంలో మోక్షజ్ఞ పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారని, అన్ని అంశాల్లో శిక్షణ తీసుకున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.