Mokshagna | బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్బస్టర్లతో దూసుకుపోతున్న నటసింహ నందమూరి బాలకృష్ణ మరో భారీ ప్రకటన చేశారు. ‘అఖండ’, ‘వీరసింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ వరుస విజయాలతో బాక్సాఫీస్‌ను శాసిస్తున్న బాలయ్య, త్వరలో ‘అఖండ 2’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత ‘NBK 111’ మూవీని కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో తన కుమారుడు మోక్షజ్ఞ నందమూరి తో కలిసి సినిమా చేయనున్నట్లు ధృవీకరించడంతో నందమూరి అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి.
1991లో విడుదలైన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికీ ఇండియన్ సినిమాల్లో అత్యంత ప్రత్యేకమైన ఫిల్మ్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ను బాలయ్య చాలా కాలం క్రితమే ప్లాన్ చేసినప్పటికీ, మధ్యలో ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అయితే ఇప్పుడు గోవాలో జరుగుతున్న 56వ IFFI వేడుకలో పాల్గొన్న బాలయ్య, మీడియాతో మాట్లాడుతూ.. “ఆదిత్య 999 మ్యాక్స్ త్వరలో వస్తుంది… ఈ చిత్రంలో నేను, మోక్షజ్ఞ కలిసి నటిస్తాం” అని ధృవీకరించారు. ఈ ఒక్క మాట నందమూరి అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చింది.
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది పెద్ద గిఫ్ట్‌గా మారింది. ‘ఆదిత్య 999 మ్యాక్స్’లో తండ్రీ–కొడుకు కలిసి కనిపిస్తారంటే నందమూరి అభిమానుల్లో హంగామా తప్పదు. ‘ఆదిత్య 369’ టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్, హిస్టరీ, యాక్షన్, లవ్… ఇలా పలు అంశాలతో మిళితమైది. ఇప్పుడు దాదాపు 35 ఏళ్ల తర్వాత అదే టైమ్ ట్రావెలింగ్ థీమ్‌తో సీక్వెల్ రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి. భారీ విజువల్ స్కోప్ ఉన్న చిత్రంగా ఇది రూపొందనుందని టాక్. కాగా, ఇప్పుడు బాలయ్య చెప్పిన ప్రకటనతో మోక్షజ్ఞ డెబ్యూ ‘ఆదిత్య 999 మ్యాక్స్’తోనే జరుగుతుందా? లేదా ముందుగా ఇంకో సోలో హీరో మూవీ చేస్తారా? అన్న సందేహాలు చర్చనీయాంశంగా మారాయి.