Mohini | ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన నటి మోహిని తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బాలకృష్ణతో నటించిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన మోహిని, ఇప్పుడు నటనకు దూరంగా ఉన్నప్పటికీ, ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన వ్యక్తిగత అనుభవాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తమిళ దర్శకుడు ఆర్.కే. సెల్వమణి తెరకెక్కించిన ‘కన్మణి’ అనే చిత్రంలో ఓ పాట కోసం స్విమ్ సూట్ ధరించాల్సిన పరిస్థితి వచ్చిందని మోహిని పేర్కొన్నారు. తనకు అలాంటి గ్లామర్ సన్నివేశాలు అస్సలు ఇష్టముండకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దుస్తులు ధరించి నటించాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.
నా అభిప్రాయానికి పూర్తిగా విరుద్ధంగా ఆ సీన్ లో నటించాల్సి వచ్చింది. అది నాకు ఎంతో అసౌకర్యంగా అనిపించింది. కానీ అప్పట్లో నేను చెప్పే పరిస్థితి లేదు అని ఆమె తెలిపింది.తెలుగులో ‘హిట్లర్’, ‘డిటెక్టివ్ నారద’ వంటి చిత్రాల్లోనూ నటించిన మోహిని, తమిళంతో పాటు మలయాళంలో కూడా పలు హిట్ చిత్రాల్లో నటించారు. దాదాపు 100 సినిమాలకుపైగా చేసిన ఆమె, ప్రస్తుతం నటనకు పూర్తిగా దూరంగా ఉంటూ, తన కుటుంబానికి పూర్తి సమయం కేటాయిస్తున్నారు.
అయితే మోహిని వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇష్టంలేకపోయినా ఎందుకు అంగీకరించారు?, “ఇన్నేళ్ల తర్వాత మాట్లాడటం ఎందుకు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం ఆమె వ్యక్తిగత అనుభవాన్ని గౌరవించాల్సిందే అని సపోర్ట్ చేస్తున్నారు. ఈ సంఘటనను ఆమె ఇన్నేళ్ల తర్వాత వెల్లడించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటన్న దానిపై చర్చ సాగుతోంది. సినిమా ఇండస్ట్రీలో నటీమణుల అభిప్రాయాలను నిర్లక్ష్యం చేయడం, గ్లామర్ ఒత్తిడి వంటివి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు.