‘47 ఏళ్ల సినీ ప్రయాణంలో తెలుగు చిత్రసీమతో ఎంతో అనుబంధం ఏర్పడింది. అక్కినేని నాగేశ్వరరావు వంటి లెజెండ్‌తో నటించే అవకాశం దక్కింది. తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమ మరెక్కడా దొరకదు. దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రీగా టాలీవుడ్ అలరారుతున్నది’ అన్నారు మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్. ఆయన కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’. సూపర్‌హిట్ మూవీ ‘లూసిఫర్’కు సీక్వెల్ ఇది.
ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ..తాము ‘లూసిఫర్’ చిత్రాన్ని మూడు భాగాలుగా తీయాలని ముందే ప్లాన్ చేశామని, ఈ సినిమా హిట్ అయితే మూడో భాగాన్ని తెరకెక్కిస్తామని తెలిపారు.
ఇది ఒరిజినల్ తెలుగు సినిమా అనే అనుభూతిని అందిస్తుందని, అద్భుతమైన క్వాలిటీతో డబ్బింగ్ చేశామని, రెండో పార్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని, బుకింగ్ ఓపెన్ చేసిన వెంటనే హౌస్‌ఫుల్స్ అవుతున్నాయని చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్కొన్నారు. ఈ సినిమా గ్రాండియర్‌గా తెరకెక్కించారని, తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని దిల్ రాజు తెలిపారు.