Kotha Lokah Movie | మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘లోక ఛాప్టర్ 1చంద్ర’ (తెలుగులో కొత్త లోక పేరుతో విడుదలైంది). గత నెల 28న విడుదలైన ఈ చిత్రం నాలుగు వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం మాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించి ఆల్‌టైమ్ హిట్‌గా రికార్డు నెలకొల్పింది. ‘కొత్త లోక’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 267 కోట్లు (గ్రాస్) సాధించింది. ఇందులో కేవలం కేరళ నుంచే రూ. 100 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ విజయంతో మోహన్‌లాల్ నటించిన ‘ఎంపురాన్’ సినిమాను దాటి మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కొత్త లోక’ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటివరకు ‘ఎంపురాన్’ రూ. 265 కోట్లు వసూలు చేసి మాలీవుడ్ ఆల్‌టైమ్ హిట్‌గా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును ‘కొత్త లోక’ బ్రేక్ చేసింది.
ప్రస్తుతం మాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘కొత్త లోక’ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ‘ఎంపురాన్’ రెండో స్థానంలో, ఆ తర్వాత రూ. 243 కోట్లతో ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూడో స్థానంలో ఉన్నాయి. అంతేకాకుండా, కేవలం కేరళలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రెండో సినిమాగా ‘కొత్త లోక’ మరో అరుదైన ఘనత సాధించింది. ఈ జాబితాలో రూ. 119 కోట్లతో ‘తుడరుమ్’ మొదటి స్థానంలో ఉంది. అయితే లాంగ్ రన్లో కొత్త లోక ఆ రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ సినిమాకు డొమెనిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ ‘వే ఫేరర్ ఫిల్మ్స్’ నిర్మించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా ఒక ఫిమేల్ సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కింది. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆమెతో పాటు నెస్లన్, చందు, సాయికుమార్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా ఒక ఫ్రాంచైజీగా కొనసాగనుంది. ఇందులో భాగంగా మరో ఐదు సినిమాలు రానున్నాయని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.