Kantara | రిషబ్‌శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘కాంతార’ చిత్రం దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సాధించింది. డివోషనల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార-1’ తెరకెక్కుతున్నది. ‘కాంతార’కు ముందు జరిగే కథతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించనున్నారని తెలిసింది. ఇందులో ఆయన హీరో రిషబ్‌శెట్టి తండ్రి పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. గత ఏప్రిల్‌లో మోహన్‌లాల్‌ను ఆయన స్వగృహంలో కలుసుకున్నారు రిషబ్‌శెట్టి. ఆ సమయంలోనే వారిమధ్య ప్రీక్వెల్‌కు సంబంధించిన చర్చలు జరిగాయని చెబుతున్నారు. ‘కాంతార-1’లో మోహన్‌లాల్ నటించడానికి అంగీకరించారని, త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. 70వ జాతీయ చలన చిత్ర అవార్డులో ‘కాంతార’ ఉత్తమ జనరంజక చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే.