మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ టైటిల్ రోల్‌ని పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘బరోజ్ 3డీ’. ఆంటోని పెరుంబవూర్ నిర్మాత. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో విడుదల చేస్తున్నది. మంగళవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ ‘నేటివ్ త్రీడీలో తీసిన సినిమా ఇది. గత 40 ఏండ్లుగా ఈ ఫార్మాట్లో సినిమాను ఎవరూ ప్రయత్నించలేదు.
మనలోని బాల్యాన్ని సెలబ్రేట్ చేసిన సినిమా. స్టోరీ టెల్లింగ్ చాలా కొత్తగా ఉంటుంది. బాల మేధావి లిడియన్ నాదస్వరం ఈ సినిమాకు సంగీతాన్నందించాడు. అందరూ ఫ్యామిలీతో కలిసి ఆనందించే చిత్రమవుతుంది’ అన్నారు. త్రీడీ, యానిమేషన్స్, వీఎఫ్ఎక్స్.. ఇలా అన్ని విభాగాల్లో సినిమా అత్యున్నతంగా ఉంటుందని క్రియేటివ్ హెడ్ టీకే రాజీవ్ కుమార్ తెలిపారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ‘కేరళ వెళ్లినప్పుడు మోహన్‌లాల్‌గారు ఈ సినిమాలో చూపించిన సాంగ్స్, విజువల్స్ అద్భుతంగా అనిపించాయి. సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.