ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 21:34:00

మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో పండగ చేసుకుంటున్న అమెజాన్

మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో పండగ చేసుకుంటున్న అమెజాన్

కొన్ని సినిమాలు అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఇప్పుడు 'మిడిల్ క్లాస్ మెలొడీస్' సినిమాను చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తున్నది. ఈ సినిమా వస్తుందని చాలా మందికి ట్రైలర్ విడుదలయ్యే ముందు వరకు కూడా తెలియదు. పోస్టర్ విడుదలైనపుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ అమెజాన్‌లో నవంబర్ 20న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. థియేటర్స్ క్లోజ్ కావడంతో నేరుగా ఆన్‌లైన్‌లో విడుదలైన ఈ చిత్రానికి వ్యూస్ పరంగా దుమ్ము దులిపేస్తుంది. అమెజాన్ ఈ చిత్రం కోసం 3.5 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ప్రమోషనల్ వర్క్‌తో కలిపి ఆనంద్ దేవరకొండపై 4 కోట్ల వరకు ఖర్చు చేశారు. 

విడుదలకు ముందే జూనియర్ దేవరకొండకు అంత మార్కెట్ ఉందా.. లేదంటే అమెజాన్ రిస్క్ చేస్తుందా అనే అనుమానాలు వచ్చాయి కానీ ఇప్పుడు సినిమాకు వచ్చిన టాక్ చూసిన తర్వాత డేర్ చేయలేదు తెలిసే తీసుకున్నారు అనిపిస్తుంది. ఆనంద్ దేవరకొండకు కెరీర్‌లో తొలి విజయాన్ని అందించింది మిడిల్ క్లాస్ మెలొడీస్. అప్పుడు 'పెళ్లి చూపులు' లాంటి సాఫ్ట్ సినిమాతో విజయ్ దేవరకొండ అందరికీ పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండకు మిడిల్ క్లాస్ మెలొడీస్ అదే గుర్తింపు తీసుకొచ్చింది. 

మిడిల్ క్లాస్ కథతో దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించిన ఈ చిత్రంలో సింపుల్ కథకు అద్భుతమైన స్క్రీన్ ప్లే.. పక్కింట్లో జరిగేలా ఉండే సన్నివేశాలు.. అల్లుకుపోయే ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఆనంద్ దేవరకొండ తండ్రిగా నటించిన గోపరాజు రమణ యాక్టింగ్ సినిమాకు అదనపు ఆకర్షణ. అన్నీ కలిపి సినిమాకు అదిరిపోయే టాక్ తీసుకొచ్చింది. ఇప్పుడు పెట్టిన డబ్బులకు రెండింతలు కాదు మూడింతలు వ్యూస్ రూపంలో వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ ఆనందంలోనే ఆనంద్ దేవరకొండ తన ఇంట్లో పార్టీ కూడా చేసుకున్నాడు. ఏదేమైనా కూడా చిన్న సినిమాలపైనే అమెజాన్ పెట్టుకున్న నమ్మకాలు నిజమవుతున్నాయి. భారీ సినిమాలన్నీ వాళ్లకు నిరాశనే మిగిల్చాయి ఒక్క సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' తప్ప.