Michael Madsen | హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ (Michael Madsen) 67 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. జూలై 3, 2025న కాలిఫోర్నియాలోని మాలిబులోని తన నివాసంలో స్పృహ కోల్పోయి కనిపించారు. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు గుండెపోటుతో (cardiac arrest) మరణించినట్లు వెల్లడించారు. ఇక మైఖేల్ మరణానికి ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని అధికారులు తెలిపారు. మైఖేల్ మరణం పట్ల హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వాల్టన్ గోగ్గిన్స్, బిల్లీ బాల్డ్విన్ వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా మైఖేల్ మాడ్సెన్ కు భావోద్వేగ నివాళులు అర్పించారు.
మైఖేల్ మ్యాడ్సన్ తన సుదీర్ఘ కెరీర్లో 71కు పైగా చిత్రాలలో నటించారు. దిగ్గజ దర్శకుడు క్వెంటిన్ టరాన్టినో దర్శకత్వంలో వచ్చిన “రిజర్వాయర్ డాగ్స్” (Reservoir Dogs), “కిల్ బిల్” (Kill Bill) వంటి చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెలుగులో వచ్చిన నిశబ్దం సినిమాలో కూడా మైఖేల్ కీలక పాత్రలో మెరిశాడు.