Megastar Mammootty | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 40 ఏండ్లుగా సినిమా రంగంలో అతడు అందిస్తున్న సేవలకు గాను ఈ అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ శుభసందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘పాదయాత్ర’ సినిమా షూటింగ్ సెట్స్‌లో చిత్ర బృందం మమ్ముట్టిని ఘనంగా సన్మానించింది. భారత ప్రభుత్వం 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను ఆయనకు ప్రకటించడంతో సెట్స్‌లో పండుగ వాతావరణం నెలకొంది.
లెజెండరీ దర్శకుడు అడూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెట్స్‌లో యూనిట్ సభ్యులందరూ కలిసి మమ్ముట్టిని సత్కరించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. దాదాపు 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మమ్ముట్టి మరియు అడూర్ గోపాలకృష్ణన్ కాంబినేషన్లో సినిమా వస్తుండటం, అదే సమయంలో ఈ గౌరవం దక్కడం విశేషం. గతంలో 1998లో పద్మశ్రీ, 2022లో కేరళ ప్రభ పురస్కారాలు అందుకున్న మమ్ముట్టి ఇప్పుడు పద్మభూషణ్ గ్రహీతగా నిలిచారు.