హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల ఫంక్షన్లో ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారమే రేపాయి. ఏపీ మంత్రులు సహా నేతలంతా మూకుమ్మడిగా చిరంజీవిపై విమర్శల దాడి చేశారు. పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి వ్యాఖ్యల పూర్తి వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోను బట్టి చూస్తే ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అనే మాటకు ముందు చిరంజీవి చాలా మాట్లాడినా ఇదొక్కటే హైలైట్ కావడంతో వివాదాదాస్పదమైంది. ఆ వీడియోలో మెగాస్టార్ మాట్లాడుతూ.. “ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది. వారంతా హ్యాపీగా ఉంటారు.
సినిమాల రెమ్యునరేషన్‌పై పార్లమెంటులో, పెద్దల సభలో మాట్లాడుతున్నారంటే ఏం పనీపాటా లేదా అనిపిస్తుంది. సర్, సినిమాలు చేస్తున్నామంటే బిజినెస్ అవుతుంది కాబట్టే. బిజినెస్ అవుతుంది కాబట్టే డబ్బులు ఇస్తున్నారు. సినిమా మీద సినిమా చేస్తున్నామంటే డబ్బులు వస్తాయని కాదు సర్. మా వాళ్లందరికీ ఉపాధి లభిస్తుందని, వారందరూ హాయిగా ఉంటారని సర్. కానీ, సినిమానే పెద్ద సమస్యలాగా, దీనికి మించి సమస్య లేదన్నట్టు పార్లమెంటులో కూడా మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం. దయచేసి సినిమాను సినిమాగా చూడండి. రాజకీయాలకు దూరంగా ఉంచండి. వీలైతే సినిమా అభివృద్దికి సహకరించండి. అణగదొక్కడానికి ప్రయత్నించొద్దు. సర్, రాజకీయ నాయకులతో పోల్చుకుంటే సినిమా ఎంతండీ. చాలా చిన్నది. అదీ చూశా.. ఇదీ చూశా సర్. మీలాంటి వాళ్లు పెద్దపెద్ద విషయాల్లో జోక్యం చేసుకోవాలి. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పేదల సంక్షేమం కోసం పాటుపడితే ప్రతి ఒక్కరు తలవంచి నమస్కరిస్తారు. అంతేకానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏంటి సర్? దీనినో పెద్ద విషయంగా చూపించవద్దు” అని చిరంజీవి పేర్కొన్నారు.