VC Sajjanar | హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా (సీపీ) ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. శనివారం నాడు నగర పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. హైదరాబాద్ సీపీగా నూతన బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ గారికి చిరంజీవి గారు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీకి చిరంజీవి గారితో పాటుగా ఆయన పెద్ద కుమార్తె, ప్రముఖ నిర్మాత సుష్మిత కొణిదెల కూడా హాజరయ్యారు. ఇరువురూ కొంత సమయం పాటు నగరంలోని శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజల సమస్యలపై చర్చించినట్లు సమాచారం.
సజ్జనార్ గతంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు, చిరంజీవి గారితో కలిసి పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్లాస్మా దానం ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీరిద్దరూ కృషి చేశారు. ఆనాటి సామాజిక సేవ అనుబంధం దృష్ట్యా, చిరంజీవి గారు సీపీని స్వయంగా కలిసి అభినందించడం విశేషం. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమాల విషయానికి వస్తే, చిరంజీవి ప్రస్తుతం మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’, అలాగే ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.