Objection My Lord | వైవిధ్యమైన కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5, మరో ఉత్కంఠభరితమైన కోర్ట్‌రూమ్ డ్రామాతో ముందుకు వస్తోంది. సీనియర్ నటుడు శ్రీకాంత్ మేకా ప్రధాన పాత్రలో నటించిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్ – నోటరీ పరశురాం చాప్టర్ 1’. ఈ మోస్ట్ అవేటెడ్ సిరీస్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ సిరీస్‌కు సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ ఎమోషనల్ కోర్ట్‌రూమ్ మిస్టరీ థ్రిల్లర్ జూలై 31, 2026 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
ఇటీవల విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అంచనాలను పెంచేసింది. హైదరాబాద్ హైకోర్టు ప్రాంగణంలో నారాయణ అనే వ్యక్తి తన కనిపించకుండా పోయిన కూతురు సమీర కోసం న్యాయం జరగలేదనే తీవ్ర వేదనతో ఆత్మాహుతి చేసుకోవడంతో ట్రైలర్ అత్యంత ఉద్వేగభరితంగా ప్రారంభమవుతుంది. ఈ ఊహించని సంఘటన నగరాన్ని, న్యాయ వ్యవస్థను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అయితే నారాయణది ఆత్మహత్య కాదని, అది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని పలు అనుమానాలు వ్యక్తమవుతాయి.
ఈ క్లిష్ట సమయంలో ఎన్నో ఏళ్లుగా కోర్టు మెట్లు ఎక్కకుండా, కేవలం నోటరీ పనులకే పరిమితమైన న్యాయవాది పరశురాం (శ్రీకాంత్) రంగంలోకి దిగుతాడు. ‘తన ప్రాణం పోయినా ఆ ఏ-బ్లాక్ వైపు వెళ్లడు’ అని తోటి లాయర్లు చెప్పుకునే పరశురాం, సడన్‌గా ఈ కేసును ఎందుకు టేకప్ చేశాడనేది ప్రధానాంశంగా నిలుస్తుంది. సీనియర్ లాయర్ ముకేశ్ రుషి, శ్రీకాంత్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ, ఎన్నో ఏళ్లుగా కేసులు లేక కేవలం పాపులారిటీ, డబ్బు కోసమే పరశురాం చేస్తున్న ప్రయత్నం ఇదని ఆరోపిస్తాడు. మరోవైపు సొంత కుమారుడు కూడా తన తండ్రిలాంటి ఫెయిల్యూర్ లాయర్‌గా మారడం ఇష్టం లేదని చెప్పే దృశ్యాలు పరశురాం జీవితంలో ఉన్న భావోద్వేగాలను, ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టంగా చూపిస్తాయి.
అసలు పరశురాం గతంలో కోర్టుకు దూరంగా ఉండటానికి కారణమేంటి, మరణించిన నారాయణ కూతురు సమీర ఎవరు, ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు, ఈ కేసులో పరశురాం నిజాలను వెలికితీసి గెలిచాడా లేదా అనే అంశాలు కథపై తీవ్ర ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సిరీస్‌లో అనన్య శర్మ వేధ పాత్రలో మెప్పించగా, విలక్షణ నటుడు ముకేశ్ రుషి విశ్వనాథ్ పాత్రలో గంభీరమైన నటనను కనబరిచారు. స్నేహాల్, సమీర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అరుణ్ చిలువేరు అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని తీవ్రతను రెట్టింపు చేయగా, సూర్య సినిమాటోగ్రఫీ హైకోర్టు డ్రామాలోని ఉత్కంఠను అద్భుతంగా ఆవిష్కరించింది. ఉత్కంఠభరిత కథనం, నటీనటుల సమర్థవంతమైన ప్రదర్శనతో రూపొందిన ‘అబ్జెక్షన్ మై లార్డ్’ జూలై 31న జీ5లో విడుదల కానుంది.